ఇంటర్నెట్కు సంధానమయ్యే హక్కు కూడా ప్రాథమిక హక్కేనని కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 18 సంవత్సరాలు నిండిన వారికి ఇది రాజ్యాంగంలో పేర్కొన్న వ్యక్తిగత గోప్యత హక్కు, విద్యా హక్కుల్లో భాగంగా ఉంటుందని స్పష్టం చేసింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సెల్ఫోన్ వాడకూడదనే నిబంధననుఉల్లంఘించారంటూ కోజికోడ్ జిల్లా చెలనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఫహీమా శిరిన్, మరికొందరు విద్యార్థినులను కళాశాల బాలికల వసతి గృహం నుంచి పంపేశారు. ఈ నిబంధన కారణంగా ఇంటర్నెట్లో తమ కోర్సుకు సంబంధించిన విషయాలను శోధించడానికి ఆటంకం కలుగుతోందని, బాలుర వసతి గృహంలో ఇలాంటి నిబంధన ఏమీ లేదని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది.