కెనాల్ రోడ్డులో సుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. హుస్సేన్‌పురం గ్రామానికి చెందిన మార్ని లోవరాము (15), మేడిద దుర్గా ప్రసాద్ (17) సామర్లకోట వెళ్లి వైట్ సిమెంట్ బస్తా కొనుగోలు చేసుకొని మోటారు సైకిల్‌పై తిరిగి గ్రామానికి వస్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటారు సైకిల్ నుజ్జునుజ్జయ్యి మార్ని లోవరాము అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్‌ను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి 108లో తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. గ్రామం సమీపంలోనే ఈ సంఘటన జరగడంతో మృతుల బంధువులు బోరున విలపించారు. సంఘటన స్థలానికి ఎస్సై ఎల్ శ్రీనివాసు నాయక్, ట్రాఫిక్ ఎస్సై సతీష్ వారి సిబ్బందితో చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు.
రంగుల కోసం వెళ్లి..
పండుగ సమీపిస్తుందని ఇంటికి రంగులు వేయడానికి వైట్ సిమెంటు తీసుకొస్తామని వెళ్లిన తమ కుమారులు మృతులుగా వచ్చారని వారి తల్లిదండ్రులు మార్ని నాగరాజు, మేడి రాంబాబు బోరున విలపించారు. గ్రామానికి చెందిన స్నేహితులిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో హుస్సేన్‌పురం గ్రామంలో విషాదం అలముకుంది. ఎప్పుడు సంతోషంగా ఉండే వారు ఇక లేరని తెలియడంతో వారి స్నేహితులు మూగబోయారు.