Home >> News >> Films>> విజయ ప్రస్థానం ముగిసింది

విజయ ప్రస్థానం ముగిసింది
Published Date :9/1/2018 11:41:36 AM
విజయ ప్రస్థానం ముగిసింది

తెలుగు పరిశ్రమలో డైనమిక్ దర్శకురాలిగా పేరు పొందిన బి.జయ (54) గురువారం రాత్రి హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. జర్నలిస్ట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె స్వయంకృషితో దర్శకురాలిగా ఎదిగారు. మహిళా డైరెక్టర్స్ ప్రాభవం తక్కువగా ఉండే చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. పాత్రికేయురాలిగా, దర్శకురాలిగా, కథా రచయితగా, కార్టునిస్టుగా బహుముఖప్రజ్ఞతో కెరీర్‌ను కొనసాగించారు. కుటుంబ అనుబంధాలు, యువతరం మెచ్చే చిత్రాలతో దర్శకురాలిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు. బి.జయ ఆకాలమరణం తెలుగు చిత్రసీమకు తీరని విషాదాన్ని మిగిల్చింది.

తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం గ్రామంలో నర్సింహరాజు, విమలాదేవి దంపతులకు జన్మించారు బి.జయ. విజయవాడలో మాంటిస్సోరిలో పదవ తరగతి వరకు చదివారు. ఇంటర్ అమలాపురంలో, డిగ్రీ మద్రాస్‌లో పూర్తిచేశారు. అనంతరం మద్రాస్ యూనివర్సిటీలో ఎం.ఏ. ఇంగ్లీష్ లిటరేచర్‌ను అభ్యసించారు. అదే యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డిప్లొమా చేశారు. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో పట్టా స్వీకరించారు.విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికల్లో జర్నలిస్ట్‌గా పనిచేశారు. వృత్తిపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు పత్రికలకు కథలు రాశారు. సమకాలీన సమస్యల్ని ప్రతిబింబించే కార్టూన్లను గీయడం హాబీగా చేసుకున్నారు. ఆమె రాసిన కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. యాభైకి పైగా కథలు, కొన్ని నవలలు రాశారామె. ఫెమినా, మిర్రర్, ఉమెన్ ఎరాలకు ఆమె పలు విశ్లేషనాత్మక కథనాలు రాశారు. బి.జయ రాసిన ఆనందోబ్రహ్మ కథకు జాతీయ అవార్డు లభించింది. దీనిని కేంద్ర సాహిత్య అకాడమీ 14 భాషల్లోకి అనువదించింది. కాలేజీ రోజుల నుంచి అభ్యుదయ సాహిత్యం, విప్లవ భావాలపై ఆమెకు మక్కువ ఉండేది. ఆర్.ఎస్.యూ, విరసం వంటి వామవక్ష భావజాల సంస్థల్లో కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారామె.తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యంపై ఉన్న అభిరుచి బి.జయను సినీరంగం వైపు అడుగులు వేసేలా చేసింది. దూరదర్శన్‌లో ప్రసారమైన అకిరా కురసోవా చిత్రమొకటి ఆమెను ఎంతగానో ప్రభావితం చేసింది. పుస్తకాల రచన కంటే సినిమాల ద్వారా ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేయొచ్చనే నమ్మకాల్ని కలిగించింది. కాలేజీ రోజుల్లోనే సత్యజిత్‌రే, మృణాల్‌సేన్ దర్శకత్వం వహించిన ఆర్ట్ సినిమాలపై మక్కవ పెంచుకుంది.ఆ అభిరుచితో సినీరంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంది. జ్యోతిచిత్ర పత్రికలో పనిచేస్తున్నప్పుడే బి.ఏ.రాజుతో ఆమెకు వివాహమైంది. అనంతరం దంపతులిద్దరూ సూపర్‌హిట్ అనే సినీ వార పత్రికను ప్రారంభించారు.చంటిగాడు (2003) చిత్రం ద్వారా బి.జయ దర్శకురాలిగా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేశారు. ఈ సినిమా ద్వారా బాలాదిత్య, సుహాసిని వంటి నూతన తారల్ని పరిచయం చేశారు. దర్శకత్వంలో ఎలాంటి పూర్వానుభవం లేకున్నా కొత్త తారాగణంతో చేసిన చంటిగాడు చిత్రం బి.జయకు మంచి పేరు తీసుకొచ్చింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన ఈ ప్రేమకథా చిత్రం కమర్షియల్‌గా కూడా చక్కటి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ప్రేమికులు (2005), గుండమ్మగారి మనవడు (2007), సవాల్ (2008), లవ్లీ (2012), వైశాఖం (2017) చిత్రాలు దర్శకురాలిగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి. పధ్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో బి.జయ ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తన సినిమాల ద్వారా ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని చిత్రసీమకు పరిచయం చేశారు. తన చిత్రాలకు ఎడిటింగ్ బాధ్యతల్ని స్వయంగా చూసుకునేవారు. తెలుగు పరిశ్రమలో తొలి మహిళా ఎడిటర్‌గా కూడా బి.జయ పేరు సంపాదించుకున్నారు.ఉన్నత విద్యావంతురాలు కావడంతో పాటు జర్నలిజంలో విశేష అనుభవం కలిగివుండటంతో తాను నమ్మిన విలువల్ని సినిమాల్లో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు బి.జయ. ఆమె చిత్రాలు కుటుంబ అనుబంధాలు, యువతరం మనోభావాలకు దర్పణంలా సాగాయి. నేను ప్రొఫెషనల్ దర్శకురాలిని కాదు. సినిమాలంటే ఎంతో మమకారం. నా భావాల్ని ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా ఎలా ఆవిష్కరించాలన్నదే నా తపన. రాశికంటే వాసికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. అందుకే లాంగ్ కెరీర్‌లో తక్కువ సినిమాలే చేశాను అని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె దర్శకత్వం వహించిన వైశాఖం చిత్రం గత ఏడాది ప్రేక్షకులముందుకొచ్చింది. బి.జయ సినీ కెరీర్‌లో ఆమె భర్త బి.ఏ.రాజు ఎంతో తోడ్పాటునందించారు. కొన్ని సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఈ దంపతులకు సినీ, మీడియా వర్గాలతో చక్కటి సాన్నిహిత్యం ఉంది.బి.జయ పార్థివ దేహాన్ని హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చిరంజీవి, వెంకటేష్, మహేష్‌బాబు దంపతులు, సుకుమార్, వంశీపైడిపల్లి, సి.కల్యాణ్, పూరి జగన్నాథ్, అచ్చిరెడ్డి, కృష్టారెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, ఛార్మి, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నందినిరెడ్డి, గుణశేఖర్, కె.ఎస్.రామారావు, ఆది, చంటిగాడు సుహాసిని, మంచు మనోజ్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. బి.జయ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం మూడుగంటలకు పంజాగుట్ట శ్మశాన వాటిలో జరిగాయి.
Related News Articles