ప్రేమికుడి ఇంటి ఎదుటే ప్రేమికురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విజయవాడ నగరంలోని పాయకాపురం శాంతినగర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన మంగళవారం నగరంలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ వన్‌టౌన్ కొత్తపేట ప్రాంతానికి చెందిన యువతి(28) కేబీఎన్ కళాశాలలో ఎంబీఏ వరకూ చదువుకుంది. తనతోపాటు డిగ్రీ చదువుకున్న పాయకాపురం శాంతినగర్ ప్రాంతానికి చెందిన దారం గోపి(29)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఎంబీఏ కూడా పూర్తిచేసిన తరువాత పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. చదువు పూర్తయ్యాక గోపి ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.
అప్పటి నుంచి ప్రేమించిన యువతితో సరిగా మాట్లాడకపోవడం చేస్తుండడంతో మనస్తాపానికి గురైన ఆ యువతి గతంలో కూడా ఇదే మాదిరిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గోపిని, వారి కుటుంబ సభ్యులను సంప్రదించారు. విషయం పోలీసులు దాకా వెళ్లడంతో టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కొన్ని నెలల కిందట కేసు నమోదైంది. పెద్దలు, పోలీసుల సమక్షంలో గోపి, అతని తల్లిదండ్రులు నవంబర్‌లో గానీ డిసెంబర్లో గానీ యువతిని పెళ్లిచేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. గోపికి గత నెలలో వేరే యువతితో అతని తల్లిదండ్రులు వివాహం చేసేశారు. విషయం తెలుసుకున్న ఆ యువతి మంగళవారం శాంతినగర్‌లోని ప్రేమికుడి ఇంటికి వెళ్లి అక్కడ బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు హూటాహూటిన సంఘటనా స్థలానికి చేరి సమీపంలోని ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. గతంలో టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు ఉన్న నేపధ్యంలో నున్న రూరల్ పోలీసులు కేసును అక్కడికి పంపారు. పోలీసులు ప్రేమికుడి కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు తెలిసింది.