Home >> News >> Latest News>> కర్నూలులో రౌడీషీటర్‌ దారుణహత్య

కర్నూలులో రౌడీషీటర్‌ దారుణహత్య
Published Date :11/9/2018 12:19:49 PM
కర్నూలులో రౌడీషీటర్‌ దారుణహత్య

జిల్లా కేంద్రంలోని సాయిబాబా సంజీవయ్య నగర్‌కు చెందిన రౌడీషీటర్‌ చెన్నయ్య (30) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు పట్టకుండా ఉండేందుకు కళ్లల్లో ఇసుక చల్లి, బండరాళ్లతో మోది, కత్తులతో పొడిచారు. ఇతను ఆర్టీసీ బస్టాండ్‌లో ఐదు నెలల నుంచి హమాలీగా పనిచేస్తున్నాడు. అంతకు ముందు పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. తండ్రి చనిపోవడంతో తల్లి బుడ్డమ్మతో కలసి సాయిబాబా సంజీవయ్య నగర్‌లో ఉంటున్నాడు. బుడ్డమ్మకు ఐదుగురు సంతానం కాగా, చెన్నయ్య నాలుగవ కుమారుడు.

అర్ధరాత్రి వరకు ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలసి బాణా సంచా కాలుస్తూ గడిపాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి గురువారం ఉదయం శ్రీచైతన్య స్కూల్‌ సమీపంలో (ఎల్‌వీటీజీ ఫిజియోథెరపీ కళాశాల ఎదురుగా) తుంగభద్ర నదిలో శవమై తేలాడు. రాళ్లతో బాది, కత్తులతో పొడిచి హత్య చేసినట్లు ఆనవాళ్లున్నాయి. మెడ, వీపు భాగాల్లో కత్తి పోట్లు ఉండగా గుండె పైభాగంలో పెద్ద రంధ్రం ఏర్పడింది. హత్య చేసి గుండె తీసుకెళ్లినట్లు మొదట పుకార్లు షికార్లు చేశాయి. ఈ మేరకు ప్రసార మాధ్యమాల్లో స్క్రోలింగ్‌ రావడంతో కర్నూలు డీఎస్పీ యుగంధర్‌ బాబు, రెండో పట్టణ సీఐ యుగంధర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. పోలీసు జాగిలాన్ని రప్పించి ఆధారాలను సేకరించే ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలం నుంచి సాయిబాబా సంజీవయ్య నగర్‌ మీదుగా బాలశివ డిగ్రీ కళాశాల వరకు వెళ్లి పోలీసు జాగిలం ఆగిపోయింది.  

ఎమ్మెల్యే అనుచరుడే హత్య చేయించాడు..!
కర్నూలు ఎమ్మెల్యే ఎస్పీ మోహన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు అదే కాలనీకి చెందిన బొల్లెద్దుల రామకృష్ణ హత్య చేయించాడని చెన్నయ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. రామకృష్ణ వడ్డీ వ్యాపారంతో పాటు కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. అతని వద్ద చెన్నయ్య 2014లో రూ.2 లక్షలు అప్పు చేశాడు. అప్పు తీర్చే విషయంలో రామకృష్ణ తన తమ్ముడు చెన్నయ్యపై దాడి చేశాడని, అతని సోదరి ఈ ఏడాది ఆగస్టు 26న రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇరువురిపై కౌంటర్‌ కేసులు నమోదయ్యాయి. 2019 ఆగస్టు నాటికి పూర్తిగా అప్పు చెల్లించాలని అప్పట్లో వారి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే పాత కక్షలను మనసులో పెట్టుకుని చెన్నయ్యను తుంగభద్ర నదిలోకి తీసుకెళ్లి రామకృష్ణ హత్య చేయించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

రామకృష్ణకు ముఖ్య అనుచరుడిగా ఉన్న శివ అనే వ్యక్తి రాత్రి ఇంటికి వచ్చి బెదిరించి వెళ్లాడని, ఉదయమే ఈ ఘటన జరిగినందున వారే ఇందుకు బాధ్యులని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హతుడికి నేర చరిత్ర ఉన్నందున గిట్టని వారెవరైనా హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అదే కాలనీకి చెందిన శివ అనే వ్యక్తి నుంచి రెండు రోజులుగా హతుని ఫోన్‌కి 20 కాల్స్‌ వచ్చినట్లు గుర్తించారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. హత్య, అత్యాచారంతో పాటు ఐదు దౌర్జన్యం కేసులు చెన్నయ్యపై ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రంలో మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 
Related News Articles