Home >> News >> Latest News>> కోడి కత్తులు కట్టడంలో తండ్రీ కొడుకులు సిద్ధహస్తులు

కోడి కత్తులు కట్టడంలో తండ్రీ కొడుకులు సిద్ధహస్తులు
Published Date :10/27/2018 3:10:45 PM
కోడి కత్తులు కట్టడంలో తండ్రీ కొడుకులు సిద్ధహస్తులు

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన నేతల తీరును, ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడుతూ ప్రజల కష్టాలను నేరుగా వారినే అడిగి తెలుసుకునేందుకు దాదాపు ఏడాది నుంచి పాదయాత్ర చేస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రాణాలు తీయాలనే కుట్రతో పదునైన కత్తితో గురువారం విశాఖపట్నం విమానాశ్రయంలో యువకుడు దాడి చేసిన వైనంపై తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ప్రాణాపాయం నుంచి జననేత తృటిలో తప్పించుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన వైఎస్సార్‌ మరణాన్ని తలచుకుని తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ప్రభుత్వ వైఫల్యానికి, కుట్రకు నిరసనగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. వారితో ప్రజలు మద్దతు తెలిపి నిరసన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పాలకులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆందోళనలు, రాస్తారోకోలు, రహదారుల దిగ్బంధనాలు, ధర్నాలు చేశారు. వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించాయి.శ్రీనివాసరావు కుటుంబం పూర్తిగా టీడీపీ నాయకులతో సన్నిహితంగా ఉంటున్న అతన్ని జగన్‌ అభిమానిగా చిత్రీకరిస్తూ ఓ ఫ్లెక్సీని సృష్టించి తప్పుడు ప్రచారానికి  పాల్పడుతున్న ఆ పార్టీ నేతల తీరును జిల్లా ప్రజలు చీదరించుకుంటున్నారు. శ్రీనివాసరావు జగన్‌ అభిమాని అని టీడీపీ నేతలే చెబుతున్న నేపథ్యంలో ఘటన జరగగానే అందరికంటే ముందు ఠానేలంకలోని అతని ఇంటి వద్దకు ఆ పార్టీ నేతలు చేరుకొని స్దానికుల్లా మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. శ్రీనివాసరావు కుటుంబీకులతో మీడియా మాట్లాడుతున్నప్పుడు కొందరు టీడీపీ నాయకులు ఇరుగుపొరుగు వ్యక్తుల్లా అతను జగన్‌ అభిమానంటూ చెప్పడంతోనే వారి నైజం బయట పడింది. నిందితుడి తల్లిదండ్రులకు, సోదరులకు అండగా వచ్చి నిలబడ్డారు. పచ్చిగా ఇదంతా గ్రామస్తుల ముందే జరుగుతున్నా సీఎం నుంచి జిల్లా టీడీపీ నేతల వరకు వైఎస్సార్‌ సీపీ అభిమానంటూ ముద్ర వేయడాన్ని చూసి జిల్లా ప్రజలు అసహ్యించుకుంటున్నారు.నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్‌ సీపీలో కార్యకర్తగా ఏ కార్యక్రమంలోనూ పాల్గొన్న దాఖలాలు లేవు. అతనికి  పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ముమ్మిడివరం నియోజకవర్గంలో జగన్‌ పాదయాత్ర నిర్వహించినప్పుడు వేలాది మంది ఆయనకు స్వాగతం పలికి సెల్ఫీలకు దిగారు. నియోజకవర్గంలో మూడు రోజులపాటు సాగిన పాదయాత్ర సమయంలో ఏ ఒక్కరోజూ శ్రీనివాసరావు పాల్గొన లేదు. జగన్‌ వీరాభిమాని అని ప్రచారం చేస్తున్న క్రమంలో ఈయనకు అంత అభిమానమే ఉంటే పాదయాత్రలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా జగన్‌ ను కలిసే ప్రయత్నం చేసేవాడు కదా అని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. జగన్‌ ఫోటో పక్కనే శ్రీనివాసరావు ఫొటో ఉంచి సృష్టించిన ఓ ఫ్లెక్సీని టీడీపీ నేతలు పథకం ప్రకారం వాట్సప్‌లో వేసి తప్పుడు ప్రచారానికి దిగడం హేయమైన చర్యగా అభివర్ణించారు.కోడి కత్తులు కట్టడంలో శ్రీనివాసరావుతోపాటు తండ్రి తాతారావు సిద్ధహస్తుడు. జిల్లా వ్యాప్తంగా కోడి పందాలకు పెట్టింది పేరైన ముమ్మిడివరం నియోజకవర్గంలో కోడి పందాలు నిర్వహించే సమయంలో ఈ తండ్రీ కొడుకులు పందెం కోళ్లకు కత్తులు కడతారు. నియోజకవర్గంలో టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇప్పటికీ పందేలు జరుగుతాయిని జగమెరిగిన సత్యం. పందెం సమయాల్లో టీడీపీ నేతలు కోళ్ల కాళ్లకు కత్తులు కట్టిస్తున్నారంటే శ్రీనివాసరావు, అతని కుటుంబీకులతో సాన్నిహిత్యం ఎలాంటిందో  ఆ పార్టీ నేతలే చెప్పాలని ఆ ప్రాంతవాసులు నిలదీస్తున్నారు.
Related News Articles