Home >> News >> Latest News>> యాదాద్రి’ వ్యవహారంపై మళ్లీ మండిపడ్డ హైకోర్టు ధర్మాసనం

యాదాద్రి’ వ్యవహారంపై మళ్లీ మండిపడ్డ హైకోర్టు ధర్మాసనం
Published Date :10/24/2018 8:25:00 AM
యాదాద్రి’ వ్యవహారంపై మళ్లీ మండిపడ్డ హైకోర్టు ధర్మాసనం

యాదాద్రిలో చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టిన కేసును తామే స్వయంగా పర్యవేక్షిస్తామని ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఆడపిల్లలకు అమానుషంగా.. హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చారా? లేదా? అనేదీ తేలుస్తామని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బీ రాధాకృష్ణన్, న్యాయ మూర్తి జస్టిస్‌ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘ఒకవేళ మేం సుమోటోగా తీసుకోకుంటే.. ఈ కేసును పాతేరేసేవారేగా’అంటూ ప్రభుత్వం, పోలీసులపై మండిపడింది. ‘కేసు దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాలకోసం ఎందుకు ప్రయత్నించలేదు. దర్యాప్తు ఎలా చేయాలో కూడా మేమే చెప్పాలా?’అని పోలీసులను ధర్మాసనం నిలదీసింది.

ఈ కేసుకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. చిన్నారుల్లో హార్మోన్‌ తాలుకు అవశేషాలను పరీక్షించాలని ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాకేశ్‌ సహాయ్‌ను ఆదేశించింది. ఇతర మందులేమైనా చిన్నారులపై ప్రయోగించారా? అనే విషయాన్నీ తెలపాలంది. ప్రజ్వల, శిశు గృహకేంద్రాల్లో ఉన్న బాధిత చిన్నారులకు తగిన రక్షణ కల్పించాలని.. ఆసుపత్రులకు వచ్చినపుడు వీరి స్వేచ్ఛ, గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో పోలీసులు, వైద్యులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించింది. ఇకపై ‘యాదాద్రి’కేసును ప్రతి మంగళవారం విచారిస్తామని చెబుతూ.. కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది.

షీటీమ్స్‌ అధికారి నేతృత్వంలో సిట్‌
‘యాదాద్రి’అమానుష ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. మంగళవారం మరోసారి విచారణ జరిపింది. జిల్లా జడ్జీ నుంచి తాము తెప్పించుకున్న చిన్నారుల వివరాలను ప్రచురించడం గానీ, ప్రసారం చేయడం గానీ చేయరాదని మీడియాను ఆదేశించింది. దీంతోపాటుగా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు విధివిధానాలను రూపొందించి.. అఫిడవిట్‌ రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇలాంటి ఘటనలకు సంబంధించి కింది కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు, బెయిల్‌ పొందిన నిందితులకు సంబంధించిన సమాచారం వివరాలను 24 గంటల్లో తమ ముందుంచాలని డీజీపీని ఆదేశించింది. షీటీమ్స్‌ నుంచి ఓ బాధ్యతాయుతమైన అధికారి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటుచేస్తామన్న డీజీపీ ప్రతిపాదనకు ధర్మాసనం ఆమోదం తెలిపింది. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని ఆదేశించింది.పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్‌.శరత్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఆ చిన్నారులపై హార్మోన్‌ ఇంజక్షన్లు వాడినట్లు మాకు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు’అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుని.. దీనిపై మీ దగ్గర శాస్త్రీయ ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించింది. హార్మోన్‌ ఇంజక్షన్లు వినియోగాన్ని తామే సశాస్త్రీయంగా తేల్చుకుంటామని స్పష్టం చేసింది. అసలు బాధితులకు ఏం వైద్య పరీక్షలు నిర్వహించారని ధర్మాసనం ప్రశ్నించగా.. బాధితులతో పాటు నిందితులకు కూడా డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించామని శరత్‌ వెల్లడించారు.‘డీఎన్‌ఏ టెస్ట్‌తో ఎంతవరకు ఉపయోగం? శాస్త్రీయ ఆధారాల కోసం దర్యాప్తు అధికారులు ప్రయత్నించారా? ఆ చిన్నారులతో లైంగిక చర్యల్లో పాల్గొన్న వ్యక్తుల వీర్యాన్ని సేకరించారా? ఎండోక్రైనాలజీ వైద్యుల చేత హార్మోన్ల పరీక్ష చేయించారా? బాధిత చిన్నారుల రక్తంలో హా ర్మోన్ల అవశేషాయాలు ఉన్నాయో లేదో తెలుసుకున్నారా? ఎందుకు ఈ శాస్త్రీయ ఆధారాల కోసం ప్రయత్నించడం లేదు. దర్యాప్తు ఎలా చేయాలో కూడా మేమే చెప్పాలా?’అంటూ నిలదీసింది. తర్వాత శరత్‌ తన వాదనలను కొనసాగిస్తూ.. చిన్నారుల విషయంలో వ్యభిచార గృహ నిర్వాహకులు చాలా తెలివిగా వ్యవహరించారన్నారు. ఆ చిన్నారుల పేర్ల మీద ఆధార్‌ కార్డులు తీసుకుని, వారిని తమ పిల్లలుగా, సమీప బంధువుల పిల్లలుగా చెప్పుకుంటూ వచ్చారని, దీంతో నిర్వాహకుల తీరుపై ఇరుగుపొరుగు వారికి అనుమానం రాలేదన్నారు.

పిల్‌గా తీసుకోకుంటే.. పాతరేసేవారే!
ఈ కేసులో ఎంత మందికి బెయిల్‌ వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. వైద్యుడికి మాత్రమే బెయిల్‌ వచ్చిందని, దీన్ని రద్దుచేయించేందుకు చర్యలు తీసుకుంటామని శరత్‌ చెప్పారు. దీనిపై కోర్టు మండిపడుతూ.. ‘బెయిల్‌ రాకుండా చేయడం వేరు. దీన్ని రద్దు చేయించడం వేరు. బెయిల్‌ ఇస్తుంటే సంబంధిత కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఏం చేస్తున్నారు? అసలు ఆ వైద్యుడి బెయిల్‌ను ఆ పీపీ వ్యతిరేకించారా? పీపీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని ఉండకపోతే.. పరిస్థితేంటి? చక్కగా ఈ కేసును పాతర వేసేవారు. అంతేకదా?’అంటూ గట్టిగా నిలదీసింది.

వ్యభిచార కూపంలో చిక్కుకున్న చిన్నారుల్లో కొందరు ప్రజ్వల, శిశుగృహ సంస్థల సంరక్షణలో ఉన్నారని, ఈ కేసులో తాము కూడా ప్రతివాదులుగా చేరి కోర్టుకు సహాయకారిగా ఉండాలనుకుంటున్నామని సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ చెప్పారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది. కాగా, ఆసుపత్రుల్లో అనుమతి లేకుండా ఎవరూ ఆ చిన్నారులను కలిసేందుకు వీల్లేదని.. వారి రక్షణ, గోప్యత విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలంటూ పోలీసులకు పలు సూచనలుచేసింది. పరిహారంతో పరిస్థితులు మారవని.. సమాజంలో అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చాలని పేర్కొంది. 
Related News Articles