Home >> News >> Latest News>> దేవుడు పిలిచాడు.. పోతున్నా...

దేవుడు పిలిచాడు.. పోతున్నా...
Published Date :10/24/2018 8:22:48 AM
దేవుడు పిలిచాడు.. పోతున్నా...

మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఓ వైద్యురాలు, శరీరంపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మండలంలోని పెద్దగోపతి పీహెచ్‌సీలో మంగళవారం ఇది జరిగింది. కొణిజర్ల ఎస్‌ఐ సీహెచ్‌ యల్లయ్య తెలిపిన వివరాలు... ఖమ్మం మామిళ్లగూడేనికి చెందిన బొంగరాల వీణ((38), కొణిజర్ల మండలం పెద్దగోపతి పీహెచ్‌సీ ఆవరణలోగల ఆయుర్వేద వైద్యశాలలో  కాంట్రాక్ట్‌ పద్ధతిలో గత ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం విధులకు హాజరయ్యారు. ఆస్పత్రిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.

కొద్దిసేపటి తర్వాత గదిలో నుంచి మంటలు, పొగ, పెద్ద శబ్దం రావడంతో స్థానికులు, పక్కనున్న పీహెచ్‌సీలోని వైద్య సిబ్బంది వచ్చారు. అప్పటికే డాక్టర్‌ వీణ పూర్తిగా మంటల్లో కాలిపోయారు. ఆమె విధులకు వచ్చేటప్పుడే కొణిజర్లలో బాటిల్‌లో పెట్రోలు కొనుగోలు చేశారని ఆమెను వైద్యశాలకు తీసుకొచ్చిన ఆటో డ్రైవర్‌ తెలిపాడు. ఆమెకు భర్త వంగూరి శివశంకర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె భర్త, హైదరాబాద్‌లోని ప్రయివేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆమె తన పుట్టింటి వారితో కలిసి ఖమ్మంలోని మామిళ్లగూడెంలో నివాసముం టున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆమె తమ్ముడు పవన్‌ ఫిర్యాదుతో కేసును ఎస్‌ఐ యల్లయ్య దర్యాప్తు చేస్తున్నారు.

మానసిక స్థితి సరిగ్గా లేకనే... 
డాక్టర్‌ వీణకు కొంతకాలంగా మానసిక స్థితి సరిగ్గా లేదని ఆమె బంధువులు తెలిపారు. కొద్ది రోజుల నుంచి మానసిక వైద్యుడి వద్ద చికిత్స చేయించుకుంటున్నట్టు చెప్పారు.
 
దేవుడు పిలిచాడు.. పోతున్నా.... 
డాక్టర్‌ వీణ హ్యాండ్‌బ్యాగ్‌లో సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో... ‘‘నాకు నా భర్త, పిల్లలు అంటే ఇష్టం. ఆయన నాకు భర్తగా దొరకడం అదృష్టం. నన్ను దేవుడు పిలుస్తున్నాడు. అందుకే చనిపోతున్నా’’ అని ఉంది. మృతదేహాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కళావతి బాయి సందర్శించారు.

source :- sakshi.com
 



Related News Articles