Home >> News >> Latest News>> ప్రేయసిని కాల్చిన చంపిన ప్రియుడు..ఆపై ఆత్మహత్య

ప్రేయసిని కాల్చిన చంపిన ప్రియుడు..ఆపై ఆత్మహత్య
Published Date :10/11/2018 9:41:30 AM
ప్రేయసిని కాల్చిన చంపిన ప్రియుడు..ఆపై ఆత్మహత్య

అర్ధరాత్రి ప్రియురాలి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న యువకుడు కొన్ని గంటల్లోనే ప్రియురాలిని హతమార్చి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమించుకున్న వారికి పెళ్లి చేసేందుకు అంగీకరించిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాడు. విల్లుపురం జిల్లా అన్నియూర్‌ కరుణానిధి నగర్‌కు చెందిన శేఖర్, మారియమ్మాళ్‌ దంపతులు తమ కుమార్తె సరస్వతి (23)ని వైద్యురాలిని చేయాలని కలలు కనేవారు. సరస్వతి సైతం పట్టుదలగా చదివేది. డిగ్రీ పాసైన తరువాత నర్సింగ్‌ కోర్సు చేస్తున్న సమయంలో వైద్య సీటు వచ్చింది. దీంతో నర్సింగ్‌ చదువును మధ్యలోనే ఆపివేసి చెన్నైలోని ఒక ప్రయివేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చేరింది.

 ప్రస్తుతం ఆమె మూడో సంవత్సరం చదువుతోంది. ఇదిలా ఉండగా, ఈరోడ్‌ జిల్లా సిద్దగౌండంపాళెంకు చెందిన కార్తివేల్‌ (27)తో ఆమెకు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చాటింగ్‌లు చేసుకునేవారు. కార్తిక్‌వేల్‌ తమిళనాడు పోలీస్‌శాఖలో కమాండో పోలీస్‌గా పనిచేస్తున్నాడు. చెన్నైలో ఉంటూ వీవీఐపీలకు సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రేమికులిద్దరూ చెన్నైలో ఉండడంతో ప్రేమ చిగురించింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరి మధ్య అడపాదడపా గొడవలు రేగేవి. మాట్లాడకోకుండా ఉంటూ మరలా కలుసుకునే వారు.  ఇదే సమయంలో సర్వస్వతి తన తోటి వైద్య విద్యార్థితో స్నేహం చేయడాన్ని కార్తిక్‌వేల్‌ తట్టుకోలేక తగవు పెట్టుకున్నాడు.మరలా ఇద్దరి మధ్య గ్యాప్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం తన జన్మదినం కావడంతో సరస్వతి అన్నియూర్‌లోని తన ఇంటికి వచ్చింది. కార్తిక్‌వేల్‌ కూడా కేక్‌తో సరస్వతి ఇంటికి చేరుకున్నాడు. వారిద్దరి ప్రేమ వ్యవహారం సరస్వతి తల్లిదండ్రులకు తెలియడంతో సాధారణంగా తీసుకున్నారు. ప్రియుడు తెచ్చిన కేక్‌ను అర్ధరాత్రి 12 గంటలు దాటగానే బంధుమిత్రుల సమక్షంలో సరస్వతి కట్‌ చేయగా కోలాహలంగా జన్మదిన వేడుకలు ముగిశాయి. ఆహ్వానితులంతా వెళ్లిపోగా సరస్వతి తల్లిదండ్రులు హాల్లో కూర్చుని టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

 ప్రేమికులిద్దరూ పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి గడియపెట్టుకోకుండా కబుర్లలోకి దిగారు. బుధవారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో వరుసగా రెండుసార్లు తుపాకీ పేలిన శబ్దం రావడంతో సరస్వతి తల్లిదండ్రులు గదిలోకి వెళ్లిచూడగా సరస్వతి, కార్తివేల్‌ చెరోవైపున ప్రాణాలు కోల్పోయిన స్థితిలో రక్తపు మడుగులో పడిఉన్నారు. పోలీసులు వచ్చి శవాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. వారిపక్కనే పడివున్న కార్తివేల్‌ సర్వీస్‌ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

అనుమాన భూతం
పోలీసుల కథనం ప్రకారం, ప్రేమికుల ఇరువురూ తరచూ తగవులాడుకుని విడిపోవడం, మరలా కలుసుకునే వారు. వైద్యకళాశాలలో తోటి విద్యార్థితో సరస్వతి చనువుగా ఉన్నట్లు కార్తిక్‌వేల్‌కు అనుమానం ఏర్పడింది. ఈ విషయమై కూడా ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ప్రియురాలి ఎక్కడ మారిపోతుందోనని గాబరాపడిన కార్తిక్‌వేల్‌ వెంటనే పెళ్లి చేసుకుందామని పట్టుబట్టడంతో సరస్వతి నిరాకరించింది. దీంతో ఆగ్రహం చెందిన అతడు తన సర్వీస్‌ రివాల్వర్‌తో ప్రియురాలి గుండెపై రెండుసార్లు తుపాకీతో కాల్చాడు. వెంటనే తన తలకు అదే రివాల్వర్‌ను గురిపెట్టుకుని పేల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కన్నీరుమున్నీరైన తండ్రి
ఎంతో గారాబంగా పెంచుకున్న కుమార్తెను కోల్పోయానని సరస్వతి శవంపై పడి తండ్రి శేఖర్‌ గుండలవిసేలా కన్నీరుకార్చాడు. ‘‘సాధారణ రైతుగా బతుకీడుస్తున్న నాకు తగిన ఆర్థిక స్థోమతలేకున్నా ఏకైక కుమార్తెను ఎంబీబీఎస్‌లో చేర్చాను, వైద్యురాలు అవుతుంది, గ్రామాల్లో సేవలందిస్తుందని కలలు కన్నాను, జన్మదినం రోజునే నా బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు’’ అని రోదించాడు. 
Related News Articles