Home >> News >> FIR>> వివాహిత అనుమానాస్పద మృతి

వివాహిత అనుమానాస్పద మృతి
Published Date :10/4/2018 8:36:44 AM
వివాహిత అనుమానాస్పద మృతి

పిల్లలు పుట్టడం లేదనే మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పలాస–కాశీబుగ్గ పట్టణంలో   చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామానికి చెందిన పట్నాల నాగవెంకట కనకదుర్గ(33)తో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గ్రామానికి చెందిన ముక్కామల వెంకట సత్యనారాయణకు 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఉద్యోగ రీత్యా ఏలూరులో కొన్నాళ్ల పాటు ఉన్నారు. సత్యనారాయణకు రెండేళ్ల కిందట పలాస సమీపంలోని రామకృష్ణపురంలో పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయానికి బదిలీ అయ్యింది. అప్పటి నుంచి పలాస–కాశీ   బుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర సినిమా థియేటర్‌ వెనుక భాగంలో ఏటీఎం అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు.  

సంతాన లేమి క్షోభతో..
దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా స్వల్ప తగాదాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి భార్యాభర్తలు వేర్వేరు బెడ్‌రూమ్‌లలో నిద్రపోయారు. బుధవారం ఉదయం సత్యనారాయణ భార్య నిద్రిస్తున్న గదికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఇరుగుపొరుగు వారికి, పోలీసులకు సమాచారం అందించారు. ఆమె నిద్రించిన మంచంపై సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రుల రాకకోసం ఎదురు చూస్తున్నామని, అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తామని కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

పిల్లలు లేకపోవడమే కారణమా..!
సత్యనారాయణ దంపతులకుపిల్లలు లేరు. ఇందుకు తానే కారణమని మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కనకదుర్గ సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. పిల్లలు పుట్టే అవకాశం లేదని నిర్ధారణ అయ్యిందని, తన వల్ల భర్త వంశం ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొంది. భర్త, అత్తమామలు చక్కగా చూసుకున్నారని, తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్‌ నోట్‌లో రాసి ఉంది. కాగా ఈ ఘటనపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫ్యానుకు కట్టిన చీర నేలకు బాగా దిగువన ఉండటం, సూసైడ్‌నోట్‌లో వివరాలను సైతం అనుమానిస్తున్నారు.
Related News Articles