Home >> News >> Top Stories>> తండ్రి.. కుమార్తె ఒకే చోట విధులు

తండ్రి.. కుమార్తె ఒకే చోట విధులు
Published Date :9/3/2018 10:53:34 AM
తండ్రి.. కుమార్తె ఒకే చోట విధులు

ఆయన ఒక పోలీస్‌ అధికారి.. పేరు ఉమా మహేశ్వర శర్మ మల్కాజిగిరి డీసీపీగా(నాగర్‌ కర్నూల్‌కు బదిలీ అయ్యింది) విధులు నిర్వహిస్తున్నారు. ప్రగతి నివేదన సభ సందర్భంగా బందోబస్తు విధులకు శనివారం వెళ్లిన ఆయనకు.. అక్కడ తన కుమార్తె సింధు శర్మ విధులు నిర్వహిస్తుండడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇతర అధికారులకు వందనం చేసినట్టే.. సింధు శర్మకూ వందనం చేశారు. బహిరంగ సభలో ఆమె మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలో విధులు నిర్వహిస్తుండగా... ఆమె పర్యవేక్షిస్తున్న బృందంలో ఉమామహేశ్వర శర్మ ఉన్నారు. ఆదివారం సభ ప్రారంభమైనప్పట్నుంచి పూర్తయ్యే వరకూ ఆమె ఆదేశాలను పాటించారు. తండ్రితో వందనం చేయించుకోవడం, ఆయనకు ఆదేశాలు జారీ చేయడంపై మీరు ఎలా స్పందిస్తారని విలేకరులు సింధు శర్మను ప్రశ్నించగా... పోలీస్‌ శాఖలో ఇది సాధారణ అంశమని, యూనిఫాం వేసుకున్న తర్వాత ఇద్దరం పోలీసుల అధికారులమంటూ వివరించారు.

ఎంతో సంతోషంగా ఉంది.. పోలీస్‌ యూనిఫాంపై విపరీతమైన ప్రేమతో ఉమా మహేశ్వర శర్మ 1985లో ఎస్సైగా పోలీస్‌ శాఖలో ప్రవేశించారు. అప్పటి నుంచి విధులు నిర్వహిస్తూ.. అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ ఎస్పీ(నాన్‌ కేడర్‌) హోదాకు చేరుకున్నారు. తండ్రి కోరికను నెరవేర్చేందుకు కృషి చేసిన సింధూ శర్మ 2014 బ్యాచ్‌ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం జగిత్యాల ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇద్దరూ ప్రగతి నివేదన సభ సందర్భంగా కలుసుకున్నారు. తన కుమార్తెతో కలిసి పనిచేసే సమయం వస్తుందని ఊహించలేదని, ఎంతో సంతోషంగా ఉందని ఉమా మహేశ్వర శర్మ తెలిపారు.

source:- eenadu.net




Related News Articles