Home >> News >> Latest News>> శిశువు కిడ్నాప్‌.. గంటల వ్యవధిలో వీడిన మిస్టరీ

శిశువు కిడ్నాప్‌.. గంటల వ్యవధిలో వీడిన మిస్టరీ
Published Date :7/10/2018 9:28:13 AM
శిశువు కిడ్నాప్‌.. గంటల వ్యవధిలో వీడిన మిస్టరీ

కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నవజాత శిశువు అపహరణ ఘటనను మరువకముందే ఆదిలాబాద్‌లోనే ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో మగశిశువు అపహరణకు గురయ్యాడు. శిశువు అదృశ్యమైన కొన్ని గంటల్లోనే ఈ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శిశువును అపహరించిన మహిళను ఇచ్చోడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు లేకపోవడంతోనే తాను శిశువును అపహరించానని నిందితురాలు పుష్పలత అంగీకరించారు. దీంతో మగశిశువును తిరిగి తల్లి మమత ఒడికి చేర్చారు. బిడ్డ కనిపించకపోవడంతో తల్లిడిల్లిపోయిన తల్లి మమత.. తిరిగి శిశువు ఒడికి చేరడంతో ఆనందం వ్యక్తం చేశారు.

ఈ నెల 2న నార్మూర్‌ మండలం చోర్‌గామ్‌కు చెందిన మమత డెలివరీ కోసం రిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఈ నెల 7న మగశిశువుకు జన్మనిచ్చారు. మంగళవారం తెల్లవారుజామున రిమ్స్‌ ఆస్పత్రిలో తల్లి ఒడి నుంచి చిన్నారి మాయమైంది. శిశువు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన మమత, ఆమె బంధువులు రిమ్స్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన గురించి తెలియడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. పట్టణంలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసి.. శిశువుతో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళ కోసం గాలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే నవజాత శిశువుతో అనుమానాస్పదంగా కనిపించిన పుష్పలతను అదుపులోకి తీసుకున్నారు. తనది ఆదిలాబాద్‌ పట్టణమేనని, తనకు పిల్లలు లేకపోవడంతో శిశువును ఎత్తుకెళ్లానని పుష్పలత పోలీసులకు తెలిపారు. కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాపైన శిశువును రెండురోజుల్లోనే హైదరాబాద్‌ పోలీసులు బీదర్‌లో కనుగొన్న సంగతి తెలిసిందే.
Related News Articles