Home >> News >> Latest News>> కోబ్రా టీం పేరుతో గంగావతి ఎమ్మెల్యేకు బెదిరింపులు

కోబ్రా టీం పేరుతో గంగావతి ఎమ్మెల్యేకు బెదిరింపులు
Published Date :6/11/2018 10:40:47 AM
కోబ్రా టీం పేరుతో గంగావతి ఎమ్మెల్యేకు బెదిరింపులు

రూ.50 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో అంతు చూస్తామని గంగావతి బీజేపీ ఎమ్మె ల్యే పరణ్ణ మునవళ్లికి  కోబ్రాటీం పేరుతో బెదిరింపు లేఖ అందింది. ఈ ఘటనపై  ఎమ్మెల్యే ఆదివారం నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం  ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం తన ఇంటివాచ్‌మెన్‌కు గుర్తు తెలియని వ్యక్తులు లేఖ అం దించి వెళ్లారన్నారు. ‘గతంలో మేము కోటి రూపాయల పాత నోట్లు ఇచ్చాం,  వాటికి బదులుగా రూ. 50 లక్షలు కొత్తనోట్లు ఇవ్వాలి.  డబ్బు ఇవ్వని పక్షంలో నీ అంతు చూస్తాం’ అని ఆ లేఖలో  హెచ్చరికలు జారీ చేశారని ఎమ్మెల్యే తెలిపారు.

గతంలో కూడా దుండగులు తనకు పార్శిల్‌లో దొంగనోట్లు పంపి బ్లాక్‌మెయిల్‌ చేశారని, అప్పట్లో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. తాజాగా మరోమారు లేఖ అందిందన్నారు. ఈ విషయంపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి అనంతరం విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమాజంలో తన పరువు తీసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.
Related News Articles