Home >> News >> True Crime Stories>> జస్టిస్ జోసఫ్‌కు పదోన్నతి ఇవ్వొద్దు

జస్టిస్ జోసఫ్‌కు పదోన్నతి ఇవ్వొద్దు
Published Date :4/27/2018 10:45:58 AM
జస్టిస్ జోసఫ్‌కు పదోన్నతి ఇవ్వొద్దు

యవ్యవస్థతో మరో తాజా ఘర్షణకు తెరతీసిన కేంద్ర ప్రభుత్వం ఓ న్యాయమూర్తి పదోన్నతి విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను తిరస్కరించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జీగా నియమించాలన్న కొలీజియం ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కేంద్రం కోరింది. ఆయనకు పదోన్నతి కల్పించడం సముచితం కాదని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా సమర్థించారు. జస్టిస్ జోసఫ్ పేరును తిరస్కరించే హక్కు ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్యానించారు. కొలీజియం సిఫారసు చేసిన రెండు పేర్లలో ప్రభుత్వం ఒకదానిని ఆమోదించి, మరొక దానిని తిరస్కరించిందని ఆయన పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా, జస్టిస్ జోసఫ్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం జనవరిలో సిఫారసు చేసింది. అయితే జస్టిస్ జోసఫ్ పేరును ప్రభుత్వం తిరస్కరిస్తున్నదని తెలుపుతూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సీజేఐ దీపక్ మిశ్రాకు గురువారం ఒక లేఖ రాశారు. ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఆమోదం ఉన్నదని తెలిపారు. 

సుప్రీంకోర్టులో చాలాకాలంగా ఎస్సీ/ఎస్టీలకు ప్రాతినిధ్యం లేదని మంత్రి తన లేఖలో గుర్తు చేశారు. దేశంలో ఇంకా అనేకమంది సీనియర్లు, తగినవారు, అర్హులైన ప్రధాన న్యాయమూర్తులు, వివిధ హైకోర్టుల సీనియర్ జడ్జీలున్నారని, అటువంటి పరిస్థితిలో జస్టిస్ జోసఫ్‌కు పదోన్నతి కల్పించడం సముచితం కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. హైకోర్టు జడ్జీల సీనియారిటీ జాబితాలో జస్టిస్ జోసఫ్ 42వ స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. ఆయనకంటే సీనియర్లు 11మంది వివిధ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారని తెలిపారు. జస్టిస్ జోసఫ్ ప్రాథమికంగా కేరళ హైకోర్టుకు చెందినవారని, ఆ రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టులో ఇప్పటికే తగిన ప్రాతినిధ్యం ఉందని పేర్కొన్నారు. కోల్‌కతా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, మేఘాలయ నుంచి ఒక్కరు కూడా సుప్రీంకోర్టులో లేరని తెలిపారు. కొలీజియం చేసిన సిఫారసును ప్రభుత్వం వేరుచేసి చూడాల్సిన అవసరం ఏర్పడిందని, ఇలా ప్రతిపాదనలను వేరుచేసి చూడటం గతంలోనూ జరిగిందని రవిశంకర్ గుర్తు చేశారు.

 

ప్రధాని ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం : కాంగ్రెస్

సీనియర్ చీఫ్ జస్టిస్ కేఎం జోసఫ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించకుండా తిరస్కరించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మునుపెన్నడూ లేని రీతిలో న్యాయవ్యవస్థపై అత్యంత దుర్మార్గపు దాడి జరుగుతున్నదని పేర్కొంది. ఇప్పుడైనా జాతి మేల్కొనకపోతే నిరంకుశత్వం పాదాల కింద ప్రజాస్వామ్యం నలిగిపోతుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. మోదీజీ ఇప్పటికే పార్లమెంట్‌కున్న అధికారాలను, దాని ఆధిపత్యాన్ని చీల్చివేశారు. మీడియాకున్న స్వేచ్ఛను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ప్రజాస్వామ్యానికున్న చివరి ఆశ్రయమైన న్యాయవ్యవస్థపై ఇప్పుడు దుర్మార్గపు దాడి జరుగుతున్నది అని సూర్జేవాలా ట్వీట్ చేశారు. జస్టిస్ కేఎం జోసఫ్‌ను సుప్రీంకోర్టుకు పంపకుండా అడ్డుకున్న అంశమేమిటని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం ప్రశ్నించారు. ఆయన రాష్ట్రమా, మతమా లేక ఉత్తరాఖండ్ విషయంలో ఆయన వెలువరించిన తీర్పా అని చిదంబరం నిలదీశారు. సుప్రీంకోర్టు జడ్జీల ఎంపిక ప్రక్రియలో ఎన్డీయే ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంటున్నదని, నిర్దేశిత ప్రక్రియ అమలయ్యేలా రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది.
 

జస్టిస్ జోసఫ్ పేరును మళ్లీ సిఫారసు చేయవచ్చు

ప్రభుత్వ నిర్ణయాన్ని కొలీజియం తిరస్కరించి, జస్టిస్ జోసఫ్ పేరును మళ్లీ న్యాయ మంత్రిత్వ శాఖకు పంపే అవకాశాలున్నాయి. అయితే జస్టిస్ జోసఫ్ పట్ల ప్రభుత్వ వ్యతిరేకత న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వర్గానికి మధ్య విభేదాలను మరింత తీవ్రతరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2016లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోదీ సర్కార్ రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించింది. దీనిపై విచారణ జరిపిన ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కేఎం జోసఫ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ తీర్పు అప్పట్లో మోదీ సర్కార్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మిగిలింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆయన పదోన్నతి వ్యతిరేకిస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
 

సిఫారసుల్లో జోక్యం చేసుకోవద్దు: జస్టిస్ లోధా

న్యాయమూర్తుల నియామకంపై కొలీజియం చేసిన సిఫారసుల్లో జోక్యం చేసుకొనే అధికారం కార్యనిర్వాహక వ్యవస్థకు లేదని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా గతంలోనే స్పష్టం చేశారు. దీనిపై ఆయన 2014లోనే ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. కొలీజియం అనుమతి లేకుండా అది చేసిన సిఫారసుల్లో జోక్యం చేసుకోరాదని తెలిపారు. సీనియర్ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యంను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న కొలీజియం సిఫారసును ప్రభుత్వం తిరస్కరించినప్పుడు ఆయన ఈ లేఖ రాశారు. కొలీజియం సిఫారసు చేసిన ఇతరుల పేర్లకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం గోపాల్ సుబ్రమణ్యం పేరును మాత్రం తిరస్కరించింది. 
 

ఏది న్యాయం?.. ఏది అన్యాయం?..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) పనితీరుపై ఏకంగా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు బహిరంగంగా ధ్వజమెత్తటం, సీజేఐ అభిశంసనకు కాంగ్రెస్ నేతృత్వంలో కొన్ని ప్రతిపక్షపార్టీలు నోటీసులు ఇవ్వటం వంటి వరుస పరిణామాల నేపథ్యంలో మరోమారు న్యాయవ్యవస్థలో ఓ వివాదాస్పద పరిణామం చోటుచేసుకున్నది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సీనియర్ మహిళా న్యాయవాది ఇందూమల్హోత్రా, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసఫ్‌ల నియామకానికి కొలిజీయం సిఫార్సు చేస్తే.. ఇందూమల్హోత్రా పేరును ఆమోదిస్తూ, జస్టిస్ జోసఫ్ పేరును కేంద్రంలోని మోదీ సర్కార్ తిరస్కరించింది. అయితే, ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. 2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోదీ సర్కార్ రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించినప్పుడు, ఆ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ జోసఫ్.. రాష్ట్రపతి పాలనను రద్దు చేశారు. అప్పట్లో మోదీ సర్కార్‌కు ఈ నిర్ణయం తీవ్ర అవమానకరంగా పరిణమించింది. ఈ నేపథ్యంలోనే, కేంద్రం జస్టిస్ జోసఫ్ నియామకాన్ని ఇప్పుడు అడ్డుకున్నదని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఇందూమల్హోత్రా నియామకం మాత్రం సరికొత్త చరిత్రను సృష్టించింది.

source ;-www.ntnews.com




Related News Articles