Home >> News >> Top Stories>> నకిలీ జామ్‌ ప్యాకెట్లు స్వాధీనం

నకిలీ జామ్‌ ప్యాకెట్లు స్వాధీనం
Published Date :2/9/2018 1:00:54 PM
నకిలీ జామ్‌ ప్యాకెట్లు స్వాధీనం

స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలోని హెచ్‌ఐజీ–36లో శ్రీసత్య కార్తీక్‌ ఏజెన్సీపై ఫుడ్‌ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు రెండో రోజు గురువారం కూడా తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా దేవతి నాగరాజు, పద్మవల్లి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వివిధ రకాల తినుబండారాలను తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ నూతలపాటి పూర్ణచంద్రరావు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ. సుందరరామిరెడ్డి బుధవారం తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే రకరకాల బ్రాండ్ల తినుబండారాలు అనేకం ఉండటంతో రెండో రోజుకూడా ఈ తనిఖీలను కొనసాగించారు. ప్రముఖ కంపెనీల పేర్లతో జామ్, సాస్‌లు తయారు చేస్తున్నట్లు ఈ తనిఖీలలో వెల్లడయ్యింది. వాటిల్లో నాన్‌ పర్మిటెడ్‌ కలర్స్‌ వాడుతున్నట్లు తేలింది.

జామ్‌లో చీమలు, ఈగలు.. మ్యాంగో, మిస్టర్‌ యాపిల్‌ పేర్లుతో తయారు చేస్తున్న జామ్‌ ముడి పదార్థం ఉన్న డ్రమ్ములలో చీమలు, దోమలు, ఈగలు ఉన్నాయి. దానినే మిషన్‌ ద్వారా చిన్నచిన్న ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. సుమారు రూ.10లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు  అసిస్టెంట్‌  ఫుడ్‌ కంట్రోలర్‌ ఎన్‌ పూర్ణచంద్రరావు తెలిపారు. రంగు రంగు ప్యాకెట్లలో ఆకర్షణీయంగా కనబడుతున్న ఈ కల్తీ ఆహార పదార్థాల కారణంగా పిల్లలు రోగాల బారిన పడతారని చెప్పారు.
Related News Articles